అనుమానంతో భార్యపై కత్తితో దాడి

484
అనుమానంతో భార్యపై కత్తితో దాడి
అనుమానంతో భార్యపై కత్తితో దాడి

భార్యపై అనుమానంతో కొబ్బరిబొండాలు నరికే కత్తితో భర్త దాడిచేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలంపల్లి  గ్రామానికి చెందిన కొయ్యల బాలకృష్ణకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన మహేశ్వరితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 సంవత్సరాల కుమార్తె ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో బాలకృష్ణ రెండేళ్లుగా గ్రామాన్ని విడిచి బయటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. గ్రామానికి వచ్చినప్పుడల్లా భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన బాలకృష్ణ భార్యతో గొడవ పడ్డాడు.

ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొబ్బరిబొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులపై నరికాడు. అనంతరం స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ పి. ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని మహేశ్వరి పరిస్థితిని గమనించగా ఆమె ఊపిరితో ఉంది. వెంటనే 108 వాహనంలో జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు