ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఆరు రోజులు అక్కర్లే

520
ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఆరు రోజులు అక్కర్లే

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఆరు రోజులు అక్కర్లే

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే ఆరు రోజులు అక్కర్లే

బాడీ టెంపరేచర్, ఎండ తీవ్రత, లైటింగ్‌తో చార్జింగ్‌

సరికొత్త డివైజ్‌ కనిపెట్టిన సునీల్‌కుమార్‌ మిత్ర బృందం

కంపెనీ స్థాపనతో మొబైల్‌ సంస్థలతో ఒప్పందం

రానున్న ఏప్రిల్‌ నెలలో మార్కెట్లోకి విడుదల

త్వరలో ప్రాసెసర్‌.. వాట్సాప్‌ని కంట్రోల్‌ చేసే

డివైజ్‌కు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు

ఎంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసిన మొబైల్‌ అయినా ఆరు నుంచి ఏడు గంటల తర్వాత దానికి చార్జింగ్‌ పెట్టాల్సిందే. నిత్యం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్,ఇన్‌స్ట్ర్రాగ్రాం లాంటివి వాడుతుండటం వల్ల ఫోన్‌లో చార్జింగ్‌ ఒక్కో పాయింట్‌దిగిపోతూ ఉంటుంది. ట్రావెలింగ్‌ సమయాల్లో ఫోన్‌ చార్జింగ్‌ అయిపోతుందేమోననే భయంతో మనతో పాటు పవర్‌బ్యాంక్‌ని కూడా వెంట తెచ్చుకుంటాం. మొబైల్‌ చార్జింగ్‌లో ఇటువంటి సమస్యలు నిత్యకృత్యం. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టి కేవలం 1.మి.మీ. సైజు ఎలక్ట్రానిక్‌ చిప్‌ (డివైజ్‌)ని కనిపెట్టి ఆరు రోజుల వరకు ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టకుండా ఉండేలా తన మిత్రులతో కలిసి సరికొత్తఅధ్యాయానికి తెర తీశాడు సిటీ కుర్రాడు సునీల్‌కుమార్‌.  గత ఏడాది ‘నాస్కో’ అవార్డును కూడా అందుకున్నాడు.    

హిమాయత్‌నగర్‌ :లింగంపల్లికి చెందిన సునీల్‌కుమార్‌ గచ్చిబౌలిలోని ఐఐటీ క్యాంపస్‌లో ఐఐటీ పూర్తి చేశాడు. అనంతరం 2016లో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. మొబైల్‌ చార్జింగ్‌ విషయంలో అనేక ఇబ్బందులు పడుతుండేవాడు. సమస్యకు ఏదైనా పరిష్కార మార్గాన్ని కనుగొనాలనుకున్నాడు. దాదాపు ఆరు రోజులు ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టకుండా దానిని వాడుకునేలా ఎలక్ట్రానిక్‌ చిప్‌ని రూపొందించి సరికొత్త రికార్డును సృష్టించాడు.

మిత్రులతో సునీల్‌కుమార్‌
ఏమిటీ డివైజ్‌ ప్రత్యేకత..
‘బ్లూ సెమీ’ పేరుతో ఎలక్ట్రానిక్‌ చిప్‌ (డివైజ్‌)ని రూపొందించాడు. దీనికోసం సుమారు మూడేళ్ల  సమయం పట్టింది. ఈ డివైజ్‌ని మొబైల్‌లోని మదర్‌బోర్డుపై సెట్‌ చేస్తారు. ఇప్పటి వరకు ట్రయల్స్‌లో ఉన్న ఈ డివైజ్‌ వచ్చే ఏప్రిల్‌ నుంచి మార్కెట్లోకి రానుంది. సునీల్‌కుమార్‌ 12మంది టీం సభ్యులతో కలిసి ఈ డివైజ్‌ని రూపొందించాడు. మొబైల్‌ కొనుగోలు చేసిన తర్వాత 100 శాతం చార్జింగ్‌ పెడితే చాలు. మరో ఆరు రోజుల వరకు మొబైల్‌కు చార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండటమే దీని ప్రత్యేకత అని సునీల్‌ కుమార్‌ తెలిపారు.

ఆటోమేటిక్‌గా చార్జింగ్‌..  
ఓ పక్క మనం చార్జింగ్‌ పెడుతూనే మరో పక్క ఫోన్‌లోని యాప్స్‌ని ఓపెన్‌ చేస్తూ చూస్తుంటాం. ఒక్క నిమిషం కూడా ఫోన్‌ని వాడకుండా ఉండలేం. దీనివల్ల మొబైల్లో చార్జింగ్‌ అయిపోవడం షరామామూలే. సునీల్‌ కనిపెట్టిన డివైజ్‌ మొబైల్‌ని మనం వాడుతుంటే.. సూర్యరశ్మి, మన బాడీ టెంపరేచర్, నైట్‌టైం లైటింగ్‌కి చార్జింగ్‌ ఆటోమేటిక్‌గా అవుతూ ఉంటుంది.

మొబైల్‌తో పాటే డివైజ్‌
మనం కొనే శామ్‌సంగ్, ఐ ఫోన్, వీవో, ఎంఐ తదితర ఫోన్లలోనే ఈ డివైజ్‌ని ఫిట్‌ చేసి ఉంచుతామని సునీల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలతో తాము ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి మార్కెట్లో తాము రూపొందించిన డివైజ్‌ను అమర్చిన ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నట్లు వివరించారు. మనం కొనే మొబైల్‌ ధరపై రూ.500నుంచి రూ.1000 అదనంగా ఆయా కంపెనీలు చార్జి చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు.

త్వరలో ప్రాసెసర్‌ కంట్రోలింగ్‌
త్వరలో మొబైల్‌ ప్రాసెసర్‌ని కంట్రోల్‌ చేసే విధంగా డివైజ్‌ని రూపొందించేందుకు సిద్ధపడుతున్నాం. ఇప్పుడున్న చిప్‌ని తయారు చేసేందుకు రూ.కోటి ఖర్చు అయ్యింది. పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏప్రిల్‌లో విడుదల అయ్యాక మొబైల్‌ వాడే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. త్వరలో ప్రాసెస్‌ కంట్రోలింగ్‌తో పాటు వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి వాటి పవర్‌ని కూడా కంట్రోల్‌ చేస్తూ చార్జింగ్‌ నిలిచేలా చేస్తాం.     – సునీల్‌కుమార్, డివైజ్‌ రూపకర్త