మనవారు పూర్తిగా తేలిపోయారు

198
మనవారు పూర్తిగా తేలిపోయారు
మనవారు పూర్తిగా తేలిపోయారు

మనవారు పూర్తిగా తేలిపోయారు

మనవారు పూర్తిగా తేలిపోయారు బౌలింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా విఫలం తొలి టి20లో 80 పరుగులతో భారత్‌ పరాజయం అదరగొట్టిన న్యూజిలాండ్‌ రేపు ఆక్లాండ్‌లో రెండో టి20 మ్యాచ్‌

వాళ్ల ఓపెనర్లు విధ్వంసక ఆరంభాన్నిచ్చారు… మనవారు పవర్‌ ప్లే ముగిసేలోపే ఔటయ్యారు… వాళ్ల మిడిలార్డర్‌ సాధ్యమైనన్ని పరుగులు చేసింది…మనవారు నిలదొక్కుకోకుండానే వెనుదిరిగారు…వాళ్ల పేస్, స్పిన్‌ ప్రభావవంతంగా కనిపించాయి… మనవారు పూర్తిగా తేలిపోయారు…! వాళ్ల ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు…మనవారు చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను వదిలేశారు…! ఫలితం… తొలి టి20లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా భారీ పరాజయం. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ఆతిథ్య జట్టు అద్వితీయమైన విజయంతో శుభారంభం చేసింది. కివీస్‌ గడ్డపై టి20 గెలుపు రుచి చూడాలంటే భారత్‌ మరో మ్యాచ్‌ వరకు ఆగాల్సి వచ్చింది.   

వెల్లింగ్టన్‌: వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్, ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (43 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా విజృంభించిన వేళ… భారత్‌తో బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్‌ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అతడికి తోడుగా ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు); కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (22 బంతుల్లో 34; 3 సిక్స్‌లు) రాణించడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది.

టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చహల్‌ (1/35) మాత్రమే కాస్తంత మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. అనంతరం బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో లక్ష్య ఛేదనలో భారత్‌ 19.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), విజయ్‌ శంకర్‌ (18 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మోస్తరుగా ఆడారు. ఆతిథ్య జట్టు పేసర్లు టిమ్‌ సౌతీ (3/17), ఫెర్గూసన్‌ (2/22); స్పిన్నర్లు సాన్‌ట్నర్‌ (2/24), ఇష్‌ సోధి (2/26) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతులేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. సీఫెర్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో టి20 శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.

ఆది నుంచే తడాఖా… 
మంచు కారణంగా ప్రత్యర్థి బౌలర్లకు బంతిపై పట్టుచిక్కదని, ఛేదన సులువవుతుందని భావించాడో ఏమో… టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం తప్పని కాసేపటికే తేలింది. కివీస్‌ ఓపెనర్లు మున్రో, సీఫెర్ట్‌… ఖలీల్‌ వేసిన రెండో ఓవర్‌ నుంచి జోరందుకున్నారు. ఈ ఓవర్లో మున్రో రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత భువీ బౌలింగ్‌లో సీఫెర్ట్‌ సిక్స్, ఫోర్, ఖలీల్‌ ఓవర్లో మున్రో రెండు వరుస సిక్స్‌లతో చెలరేగారు. వీరిద్దరినీ తప్పించి పాండ్యా సోదరులను దింపినా మార్పు లేకపోయింది. ఈ ద్వయం 4.1 ఓవర్లలోనే 42 పరుగులిచ్చింది. కివీస్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యం 5వ ఓవర్లోనే 50 దాటింది.

సీఫెర్ట్‌ 30 బంతుల్లోనే టి20ల్లో తన తొలి అర్ధ శతకాన్ని అందుకున్నాడు. అయితే, కృనాల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మున్రో లాంగాన్‌లో విజయ్‌ శంకర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సీఫెర్ట్‌… కృనాల్, చహల్‌లను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు కొడుతూ చకచకా 80ల్లోకి వెళ్లిపోయాడు. అతడిని ఖలీల్‌ యార్కర్‌ లెంగ్త్‌ బంతితో పెవిలియన్‌ చేర్చాడు. విలియమ్సన్‌ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. వరుస బంతుల్లో మిచెల్‌ (8), విలియమ్సన్‌ ఔటవ్వగా… గ్రాండ్‌హోమ్‌ (3) నిలవలేకపోయాడు. రాస్‌ టేలర్‌ (14 బంతుల్లో 23; 2 సిక్స్‌లు), స్కాట్‌ కుగ్లీన్‌ (7 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.

ఛేదనలో చతికిల… 
ప్రత్యర్థి స్కోరుకు తోడు సౌతీ తొలి ఓవర్‌తోనే ఛేదన సులువేం కాదని భారత్‌కు తెలిసిపోయింది. అయితే, కుగ్లీన్‌ వేసిన రెండో ఓవర్లో ధావన్‌ రెండు వరుస సిక్స్‌లు, ఫోర్‌తో ఆశలు రేపాడు. కానీ, రోహిత్‌ (1)ను షార్ట్‌ బంతితో సౌతీ బోల్తా కొట్టించాడు. అతడు భారీ షాట్‌ ఆడబోగా డీప్‌ స్వే్కర్‌ లెగ్‌లో ఫెర్గూసన్‌ పరుగెడుతూ క్యాచ్‌ పట్టాడు. శంకర్‌ సైతం కుగ్లీన్‌ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడం, ధావన్‌ టచ్‌లో ఉండటంతో జట్టు పరిస్థితి ఆశావహంగా కనిపించింది. కానీ, ఫెర్గూసన్‌ 151 కి.మీ. వేగంతో సంధించిన యార్కర్‌ ధావన్‌ వికెట్లను గిరాటేసింది.

పదేపదే షాట్లకు యత్నిస్తున్న రిషభ్‌ పంత్‌ (4) తక్కువ ఎత్తులో వచ్చిన సాన్‌ట్నర్‌ ఫుల్‌ టాస్‌కు బౌల్డయ్యాడు. రెండు బంతుల వ్యవధిలో శంకర్‌ కూడా ఔటయ్యాడు. పూర్తిగా ఆఫ్‌ సైడ్‌ పడిన సోధి బంతులను షాట్లకు యత్నించి దినేశ్‌ కార్తీక్‌ (5), హార్దిక్‌ పాండ్యా (4) వికెట్లు ఇచ్చుకున్నారు. అప్పటికి జట్టు స్కోరు 77/6. 54 బంతుల్లో 143 పరుగులు చేయాల్సిన దశలో ధోని, కృనాల్‌ (18 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) పోరాటం సరిపోలేదు. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరుగుతూ పోయింది. 17 నుంచి 20వ ఓవర్‌ మధ్య వీరిద్దరితో పాటు భువీ (1), చహల్‌ (1) ఔటవడంతో మరో నాలుగు బంతులు ఉండగానే భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.

మనకిదే భారీ ఓటమి… 
పరుగుల (80) పరంగా టి20ల్లో భారత్‌కిదే అతి పెద్ద ఓటమి. గతంలో ఎప్పుడూ 50 పరుగుల కంటే ఎక్కువ వ్యత్యాసంతో ఓడలేదు. 2010లో ఆస్ట్రేలియాపై 49 పరుగులతో పరాజయం పాలైంది.

తేడా అతడే… 
క్రీజులో కదిలే విధానంతో పాటు బంతిని కసిదీరా బాదడం, ప్రారంభం నుంచే విరుచుకుపడే తీరుతో మ్యాచ్‌లో సీఫెర్ట్‌ ఇన్నింగ్స్‌ కివీస్‌ దిగ్గజం మెకల్లమ్‌ ఆటను తలపించింది. అతడు కొట్టిన షాట్లన్నీ బుల్లెట్‌లా దిగాయి. సిక్స్‌లు సైతం అలవోకగా కొట్టాడు. అతడి ధాటికి జట్టు స్కోరు 11వ ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. 13వ ఓవర్లోనే 80ల్లోకి చేరిన సీఫెర్ట్‌ సెంచరీ ఖాయం అనుకుంటుండగా వెనుదిరిగాడు. లేకుంటే కివీస్‌ స్కోరు ఎక్కడికో వెళ్లేదే.

అన్నదమ్ములు బరిలోకి… 
అన్నదమ్ములు కృనాల్, హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున తొలిసారి బరిలో దిగారు. మొహిందర్‌ అమర్‌నాథ్, సురీందర్‌ అమర్‌నాథ్‌… యూసుఫ్‌ పఠాన్, ఇర్ఫాన్‌ పఠాన్‌ తర్వాత దేశానికి ఒకే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన సోదరులు వీరే కావడం గమనార్హం. మరోవైపు యువ శుబ్‌మన్‌ గిల్‌ను పక్కనపెట్టిన భారత్‌… ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఆడించింది. అతడిని అనూహ్యంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపింది.

ఒకటి పట్టాడు… రెండు వదిలాడు 
మ్యాచ్‌లో లాంగాన్‌ బౌండరీ లైన్‌ వద్ద మిచెల్‌ క్యాచ్‌ను దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా అందుకున్నాడు. సరిగ్గా రోప్‌ ముందర బంతిని పట్టుకున్న అతడు… లోపలకు నెట్టి బౌండరీని దాటాడు. తిరిగివచ్చి గాల్లో ఉన్న బంతిని ఒడిసిపట్టాడు. అయితే, తొలుత కృనాల్‌ బౌలింగ్‌లో సీఫెర్ట్‌ క్యాచ్, తర్వాత హార్దిక్‌ ఓవర్లో రాస్‌ టేలర్‌ క్యాచ్‌లను అతడు జారవిడిచాడు. మరోవైపు సీఫెర్ట్‌ 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు కృనాల్‌ బౌలింగ్‌లో ధోని కొంత క్లిష్టమైన క్యాచ్‌ను వదిలేశాడు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ ఇచ్చిన క్యాచ్‌లను కివీస్‌ ఆటగాళ్లు చక్కగా పట్టారు.