అందుకు ఓకే…కానీ

656

అందుకు సిద్ధమైతే కండిషన్స్‌ అప్లై అంటోంది నటి సాయిపల్లవి. ప్రేమమ్‌ చిత్రంతో మలయాళంలో కథానాయకిగా పరిచయమైన ఈ తమిళ అమ్మాయి కోలీవుడ్‌కు మాత్రం కొంచెం ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చింది. డాక్టరు కాబోయి యాక్టర్‌ అయిన ఈ సహజ నటి మలయాళం తరువాత తెలుగులో పరిచయమై అక్కడి ప్రేక్షకులను ‘ఫిదా’ చేసి సక్సెస్‌ఫుల్‌ కథానాయకిగా పేరు తెచ్చుకుంది.

ఆ సమయంలోనే కోలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చినా నిరాకరిస్తూ వచ్చిన సాయిపల్లవి ఎట్టకేలకు విజయ్‌ దర్శకత్వంలో దయా చిత్రంతో పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తరువాత ధనుష్‌తో మారి–2 చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రం కూడా సోసో అనిపించుకున్నా, అందులో రౌడీ బేడీ పాట వీర లెవల్‌లో హిట్‌ అయిపోయ్యింది. ప్రభుదేవా నృత్యరీతులను సమకూర్చిన ఈ పాటకు ధనుష్‌తో పాటు సాయిపల్లవి డాన్స్‌లో ఇరగదీసింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు పొందుతూ ప్రపంచస్థాయితో దుమ్మురేపుతోంది.

ఆలా పాపులర్‌ అయిన సాయిపల్లవి కొత్త చిత్రాలను అంగీకరించడంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం తమిళంలో సూర్యతో జత కట్టిన ఎన్‌జీకే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. అదీ చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక మలయాళంలో పాహద్‌ పాజిత్‌ సరసన ఒక చిత్రం, తెలుగులో రానాతో ఒక చిత్రం చేస్తోంది. అయితే పారితోషికం విషయంలో ఈ అమ్మడు చాలా లిబరల్‌గా వ్యవహరిస్తోంది. ఆ మధ్య తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు విజయానికి దూరం అయితే ఈ అమ్మడు ఆ చిత్ర నిర్మాత ఇవ్వాల్సిన రూ.40 లక్షలు వదిలేసిందట. ఇకపోతే తాజాగా ఒక నిర్ణయం తీసుకుందట. తనకు పారితోషికం ముఖ్యం కాదని, దాన్ని ఇంకా తగ్గించడానికి సిద్ధమేనని అంటోందట. అయితే ఒక కండిషన్‌ అని కథ చాలా బలంగా ఉండాలని అప్పుడే పారితోషికం తగ్గించి నటించడానికి సిద్ధమని సాయిపల్లవి అంటోందట. ఇది మంచి కథా చిత్రాల దర్శక నిర్మాతలకు ఆమె ఇచ్చే మంచి ఆఫర్‌నే అవుతుంది.